టైమ్స్ మీడియా స్కూల్ ఆధ్వర్యంలో కరోనాపై ఆన్‌లైన్ కాన్ఫరెన్స్.. దేశంలోనే తొలిసారి

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుండగా.. దీనిపై టైమ్స్ ఆఫ్ ఇండియాాకు చెందిన బెన్నెట్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మీడియా ఒక్క రోజు ఆన్‌లైన్ కాన్ఫరెన్స్ ఏప్రిల్ 9న నిర్వహిస్తోంది. కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తమ అనుభవాలను చర్చించడానికి మీడియా, వైద్య, పబ్లిక్ పాలసీ, టెక్నాలజీ విభాగాల్లోని ప్రముఖ నిపుణులు ఇందులో పాల్గొననున్నారు. ఇలా కరోనా వైరస్ గురించి చర్చా కార్యక్రమాన్ని ఓ ఇండియన్ యూనివర్సిటీ నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి. ‘గ్లోబల్ ఆన్‌లైన్ కాన్ఫరెన్స్ ఆన్ కోవిడ్-19; సంక్షోభం, భవిష్యత్తు’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు రంగాలకు చెందిన నిపుణులు వివరించనున్నారు.


ఏప్రిల్ 9 సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9.30 వరకు జరిగే ఈ కాన్ఫరెన్స్‌ను ఆరు సెషన్‌లుగా విభజించి, మూడు థీమ్స్ గురించి చర్చిస్తారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ప్రారంభించి, కీలక ఉపన్యాసం చేయనున్నారు.

థీమ్-1 (4.30 నుంచి 5.30): ఆర్థిక సంక్షోభం అధిగమించి ముందుకు సాగడం ఎలా?; అనే అంశం గురించి కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్ధిక సలహాదారు, ఐఎంఎఫ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవింద్ వీర్‌మణి, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, ప్రధాని ఆర్ధిక సలహా మండలిలో మాజీ సభ్యుడు ప్రొఫెసర్ షమీక రవి ప్రసంగిస్తారు.

థీమ్- 2 (5.40 నుంచి 6.40): కరోనా వైరస్ నియంత్రణకు వివిధ దేశాలు చేపట్టిన చర్యలు గురించి ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఇండియా-చైనా స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంజూన్ జంగ్ వివరించనున్నారు. ముఖ్యంగా కోవిడ్-19 విషయంలో చైనా ఎలాంటి చర్యలను తీసుకుంది, దాని ఫలితాలను వెల్లడిస్తారు. అలాగే ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ బోలోగ్నా ప్రొఫెసర్ డాక్టర్ బీయట్రిస్ గెలిలీ తమ దేశంలో అనుభవాలను పంచుకోనున్నారు.