సికింద్రాబాద్‌లో యువకుడి ఆత్మహత్య.. ప్రకాశం జిల్లాలో విషాదం

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో సామాన్యులకు ఆర్థిక సమస్యలు ఎక్కువవున్నాయి. చేతిలో డబ్బుల్లేక.. చేసేందుకు పనిలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబం అప్పుల పాలవడం.. లాక్‌డౌన్‌తో చేతిలో డబ్బుల్లేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది.ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం గాలిజెరుగుల్ల గ్రామానికి చెందిన దేశబోయిన నారాయణ(22) గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఆర్పీఎఫ్‌లో హోంగార్డుగా పని చేస్తున్న మేనమామ ప్రసాద్‌తో కలసి చిలకలగూడలో నివాసం ఉంటున్నాడు. లాక్‌డౌన్‌తో రూమ్‌కే పరిమితమైన నారాయణ మానసికంగా కుంగిపోయాడు. ప్రసాద్ డ్యూటీకి వెళ్లిన తరువాత రూమ్‌లో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.